గుండుమల దందా!

మడకశిర నియోజకవర్గం జిల్లా సరిహద్దులో కర్ణాటకకు సమీపంలో ఉంది. అక్షరాస్యత శాతం చాలా తక్కువ. ప్రశ్నించే తత్వం కూడా లేని ప్రాంతం. దీన్ని ఆసరా చేసుకున్న ఎమ్మెల్సీ గుండుమల కుటుంబం టీడీపీ హయాంలో క్వారీల బిజినెస్‌ ప్రారంభించింది. కొండ కనబడితే పిండేస్తూ రూ.కోట్లు సంపాదించింది. తమ్ముళ్లందరినీ క్వారీ బిజినెస్‌లో దింపిన గుండుమల నిబంధనలకు విరుద్ధంగా సహజవనరులన్నీ దోచేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలిస్తూ విలువైన గ్రానైట్‌ను అడ్డగోలుగా సరిహద్దు దాటించేస్తున్నారు. తమ పరిధిలో ఎవరైనా పొరపాటున క్వారీ బిజినెస్‌ చేయాలన్నా కప్పం కట్టాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూ భారీగా వసూళ్లు చేస్తున్నారు.